ఫిలిప్పీన్స్‌ భూకంపం: ప్రాణాలకు తెగించి మనవడిని కాపాడిన బామ్మ.. నెట్టింట వీడియో వైరల్!

  • ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం
  • భూకంపం సమయంలో మనవడికి అడ్డుగా నిలిచిన ఓ బామ్మ
  • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • బామ్మను 'సూపర్ హీరో' అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
ప్రకృతి ప్రకోపానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణికిపోతున్న వేళ, ఓ బామ్మ చూపిన ధైర్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసిన సమయంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మనవడికి రక్షణ కవచంలా మారిన ఆమెను నెటిజన్లు 'సూపర్ హీరో' అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె సాహసం అందరి హృదయాలను కదిలించింది.

సోమవారం దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూమి తీవ్రంగా కంపించడంతో తాము నివాసం ఉంటున్న భ‌వ‌నం ఊగ‌డం మొదలైన వెంటనే, ఓ వృద్ధురాలు తన పక్కనే ఉన్న మనవడిని దగ్గరకు లాక్కుని, తన శరీరాన్ని అడ్డుపెట్టి కాపాడే ప్రయత్నం చేసింది. ఈ దృశ్యం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో షేర్ అయిన కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. భయానక పరిస్థితుల్లోనూ ఏ మాత్రం తడబడకుండా, మనవడిని కాపాడాలనే ఆమె తపనను చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.

ఈ భూకంపం ధాటికి సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. 'రాయిటర్స్' వార్తా సంస్థ ప్రకారం.. ఈ విపత్తు కారణంగా కనీసం 37 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. సరంగాని ప్రావిన్స్‌కు 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూప్రకంపనల తీవ్రతకు ఇండోనేషియాలోని సులవేసి ద్వీపం వరకు భూమి కంపించింది.

పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉండటం వల్ల ఫిలిప్పీన్స్‌లో భూకంపాలు సర్వసాధారణం. అయితే, ఈ విపత్తు మధ్యలో బామ్మ చూపిన ప్రేమ, ధైర్యం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. 'భయంకరమైన భూకంపం ఇది. ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్' అంటూ ఒకరు కామెంట్ చేయగా, 'ఇలాంటి వీడియోలు చూస్తుంటేనే 7.8 తీవ్రత ఎంత భయంకరమో అర్థమవుతోంది. ఆమె చూపిన తెగువకు నా సెల్యూట్' అని మరో యూజర్ పేర్కొన్నారు. ఈ విపత్తులో చిక్కుకున్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు పలువురు కామెంట్లు పెట్టారు. ఈ ఘటనతో విపత్తుల సమయంలో పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరోసారి చర్చ మొదలైంది.

Philippines Earthquake
Grandmother saves grandson
Viral earthquake video
Sarangani province earthquake
7.8 magnitude earthquake
Philippines disaster news

More Telugu News